నా సెల్ 9000470542

వేశ్యా తార కత

                 Sudarshanchitti42.blogspot.com
  వేశ్యా తార 




           పొద్దున్నే పుట్టిన సూర్యరాజుకు అప్పుడే పళ్ళు ఊడిపోయాయి. కాలాన్ని నమిలి మింగలేక కాలంలో కలిసినాడు. కోనసీమలోని కొబ్బరి మట్టల సందుల్లోంచి కనపడుతూ గోదావరి మీదుగా మెల్లగా ఆకాశం దిగి ఇల్లు చేరాడు.
          రాజమహేంద్రవరం టు రావులపాలెం బస్సు పొగలు చిమ్ముతూ బయలు దేరింది. కండక్టర్ టిక్కెట్ల వ్యాపారాన్ని తొందరగా ముగించుకొని దర్జాగా ఆయన సింహాసనం మీద కూచున్నాడు. మబ్బులు మసక మసకగా కన్పిస్తున్నాయి బస్సులోని వారందరికి. చల్లటి గాలి అందరి శరీరాల్ని ముద్దుపెట్టుకుంటుంది.
     ఎప్పుడెక్కిందో ఏమో గానీ గోదావరి కంటే అందమైన అమ్మాయొకతి బస్సు కుడివైపున ఐదో సీటు లో కూచున్నది. ఆమె ఎక్కినప్పటినుంచి బస్సు వేగం పెరిగింది. పది కిలోమీటర్లు ముందుకు వెళ్ళాక ముగ్గురు యువకులను కూడా బస్సు ఎక్కించుకుంది. 
     ఎక్కి ఎక్కగానే మొదటి వాడికి కళ్ళు బైర్లు కమ్మాయి. రెండోవాడు లొట్టలేసుకుంటూ రెప్పలు పెద్దవి చేశాడు. ఇక మూడో వాడు గాలికెగురుతున్న పైట కింద చూశాడు. ఈ ముగ్గురు అస్సలు మహా ముదుర్లు కారు. వీరిలో మొదట బస్సెక్కిన చామన ఛాయ రంగు వాడు సినిమా రంగంలో దర్శకుడిగా స్థిరపడాలనుకునేవాడు. లొట్టలేసుకున్న కుర్రాడు అందంగా ఉన్నాననే అహంతో హీరో కావాలనుకునేవాడు. పైట కింద చూసిన మూడో వాడు నిర్మాతగా స్థిరపడి బాగా డబ్బు సంపాదించాలనే అత్యాశ ఉన్నవాడు. వీళ్ళ చేతిలో చిల్లిగవ్వ లేదు గానీ బుర్రలో మాత్రం గంపెడంత తెలివుందని వీళ్ళ ఊరి వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకంతోనే హైదరాబాద్ వచ్చి స్టూడియోల చుట్టూ విడివిడిగా తిరిగి అవకాశాలు దొరక్క నిరాశతో బస్సెక్కి ఊరికి బయలుదేరారు. 
         ఆకలి బాగా వేయడంతో తిందామని రాజమహేంద్రవరం దాటాక ఒక దగ్గర తిని బస్సు కోసం ఎదురుచూస్తుండగా ఈ బస్సు వచ్చింది. 
    బస్సులో కుడివైపు వెనక నుంచి నాలుగో సీటులో ముందున్న అమ్మాయి వెనక ఈ ముగ్గురు కూచున్నారు. 
       "అరేయ్ నేను సినిమాలో మెగాస్టార్ అంతటి వాణ్ణి కాకపోయినా హీరోని మాత్రం కావాలి. అయినా నాకేం తక్కువరా అందం లేదా? ఆహార్యం లేదా?
      "హ్మ్మ్ డబ్బు లేదు. అరేయ్ ఇంతకూ నువ్వేమనుకుంటున్నావ్ రా. హైటున్నంత మాత్రాన అమితాబచ్చన్ అనుకుంటున్నావా?
మనమోహాలకు కావాలన్న కోరికలే ఎక్కువగానీ కోట్లు తక్కువే"నని దర్శకుడు అంటాడు. 
      "అంటే మన ఆశలన్నీ గోదాట్లో కలిసినట్టేనా, మన వల్ల కాదంటావా? ఎట్లా కాదో చూడు ఈసారి పండిన అరటి తోటనంత అమ్మి చిన్న సినిమాలకు నిర్మాత అవుతా" నంటాడు.
       ఇట్లా ఎవరి ఆసక్తిని వాళ్ళు తెలుపుకుంటూ సాధన దిశగా కలలు కంటారు. 
వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు ఓరగా ఓసారి ముందున్న అమ్మాయి హీరోని చూసి క్షణకాలంలోనే తల ముందుకు తిప్పుకుంది. 
    ఆమె కళ్ళను చూసిన హీరో ఈ లోకాన్ని మరిచి కలకంటున్నాడు. 
"అబ్బబ్బ ఏమి అందంరా. ఇంత అందగత్తెని ఈ గోదావరి జిల్లాలో చూడడం ఇదే మొదటి సారి" అని ఇద్దరికి వినపడకుండా అనుకున్నాడు. 
మధ్యలో కూచున్న దర్శకుడు ఆమె జడవైపు అదే పనిగా చూస్తున్నాడు. 
     నేను తీసే సినిమాలో హీరోయిన్ కి జడ ఇట్లా ఉండాలి. నడుస్తుంటే జడ పిరుదులకు తాకాలి. ప్రేక్షకులు చూసి ఎగపడాలి" అని నిర్మాతతో అంటున్నాడు. 
     నిర్మాత మెల్లగా మరోసారి ఆమె ముఖాన్ని చూడడానికి నానా పాట్లు పడుతున్నాడు. ఎడమ నుంచి కుడి నుంచి అయిన వీలు పడలేదు. ఎలాగైనా చూడాలి అనుకునేలోపే ఎందుకో గానీ ఆమె వెనక్కి తిరిగి చిన్నగా నవ్వింది. 
        నిర్మాత కళ్ళతో పైకి చూసి మెడలో నోట్ల కట్టల మాల ఉన్నట్టు కలల ఆకాశంలో విహరిస్తున్నాడు. 
        ఒకరికి తెలియకుండా ఒకరికి ఈ అమ్మాయంటే బాగా నచ్చింది. కానీ మిగతా ఇద్దరు ఏమనుకుంటారోనని ఎవ్వరూ కూడా పైకి చెప్పలేరు. 
    బస్సు నడుస్తూనే ఉంది. వీళ్ళ కలలు బస్సు కన్నా వేగంగా ఉన్నాయి. అప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడ్డం ఎలా అని ఎవరికి తోచినట్టు వారు నానా ప్రయాస పడుతున్నారు. 
అటు ఇటుగా చూస్తున్న ఆమెకు తన ఫోన్ మోగినట్లు తెలివిడి అయ్యింది. 
      "హాలో! ఆ ఎవరు? 
       ఆ చెప్పండి. 
       ఏం కావాలి. ఎంత? 
       వెయ్యికి కుదరదు గానీ ఇంకో మాట చెప్పు?
        లేదు కుదరదు.
        ఆ సరే రేపు రాజమండ్రి పక్కనున్న కొబ్బరి తోటలోకి రా" అని నోటికి చెయ్యి అడ్డం పెట్టి చిన్నగా మాట్లాడిన దృశ్యాన్ని ముగ్గురూ దొంగల్లాగా విన్నారు. వీరు విన్నట్టు ఆమెకు ఏమాత్రం తెలియదు. 
     "రావులపాలెం వచ్చిందండి. ఉన్నవాళ్లు దిగాలే" కండక్టర్ అరుపు వినగానే పైట సరిచేసుకొని గోదావరి వంపుల్లాగా నడుమును వంపుకుంటు వయ్యారంగా నడుచుకుంటూ దిగి వెళ్ళింది. 
     "ఈమె అటు ఇటుగా మన వయస్సు అంతనే ఉండి ఉంటది" నిర్మాత అన్నాడు.
    "అవును అంతే ఉండొచ్చు గానీ ఆమె మెడలో తాళి లేదు. కాళ్ళకి మెట్టెలు లేవు. అయినా కోక కట్టింది.  భర్త పోయాడంటావా" దర్శకుడు అన్నాడు. 
     "అరేయ్ ఇంకా పెళ్లి కాకపోవచ్చు కదా. అయినా పెళ్లి అయిన వాళ్లే కోక కట్టాలని ఏమైనా నియమం ఉందా? అమ్మాయి ఆహార్యాన్ని కాదురా. అందాన్ని చూడు"
    ఇట్లా ఆమె బస్సు దిగాక అనేక సంభాషణలు ఆమె గురించే. అప్పుడు నిర్మాత ఇలా అన్నాడు
" అరేయ్ మన ముగ్గురి ఆశయం ఒక్కటే సినీ ఇండస్ట్రీలో స్థిర పడడం. మనం అవకాశాల కోసం తిరిగి తిరిగి చెప్పులు తెగిపోయాయి అయిన అవకాశం రాలేదు. ఇంకా కూడా మనం వాళ్ల చుట్టూ తిరగడం శుద్ధ దండగా. ఇక మనమే స్వంతంగా కెమెరాలను అద్దెకు తీసుకుని షూటింగ్ చేద్దాం. వాడి దగ్గర మంచి కథ ఉందట. దానికి నేను డబ్బులు పెడతా. నువ్వే దానిలో హీరోవి"
   "మరి హీరోయిన్ ఎవరు?
   "ఇప్పటిదాకా మనముందున్న అమ్మాయే"
   ఈ మాట వినగానే హీరో ముఖం బయటికి కనపడకుండా వెలిగిపోతోంది. అంతే ఇక నిశ్శబ్దంగా ఉన్నాడు.
"ఇంతకు ఆమె ఒప్పుకుంటుందా?
"మన ప్రయత్నం మనం చేద్దాం. రేపు కొబ్బరి తోటకు ఎవరినో రమ్మంది కదా. అక్కడికి మనం ఆమె కంటే ముందు వెళదాం" అనుకున్నారు.
   వాళ్ళ ముగ్గురిది ఒకే ఊరు కావడంతో రావులపాలెం దాటాక మొదటి స్టేజి దగ్గర దిగారు. నడుచుకుంటూ ఎవరింటికి వారు వెళ్లారు. 
       మరుసటి రోజు ఉదయం ముగ్గురు ఎనిమిది గంటల వరకు రాజమహేంద్రవరం పక్కనున్న కొబ్బరి తోటకు చేరారు. 
ఆమె ఎప్పుడు వస్తుందా అని ఆరు కళ్ళను ఆ దారి వైపు పడ వేశారు.
నిర్మలమైన గోదారి ఓ వైపు హొయలు ఊపుతున్నాయి. పొడవాటి కొబ్బరి చెట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. నదీ పరవళ్లు తొక్కుతూ లేత ఇసుకు రేనువులకు బంగాళాఖాతాన్ని చూపడానికి తనతో తీసుకెళ్తుంది. 
    చంటి పిల్లలు నది ఒడ్డుపై ఇసుకతో పిట్ట గూళ్లను కడుతూ స్వచ్ఛమైన ఆనందంలో తేలుతున్నారు. కొంచెం నడీడు వయసు వారు అరటి గెలలను సైకిలుకు రెండు వైపులా పెట్టుకొని తీసుకెళ్తున్నారు. ఆ దృశ్యాల్ని చూస్తున్న దర్శకుడు ఇంకా అందంగా ఊహించుకుంటున్నాడు.
         నిర్మాత దీర్ఘంగా ఆలోచిస్తుండగా వాళ్లకు కొంచెం దూరంలో ఒక ఆటో అప్పుడే వచ్చి ఆగింది. ఎవరో ఒక అడుగు బయట పెట్టి దిగుతున్నారు. హీరో కూడా చూస్తున్నాడు. దర్శకుడు మాత్రం లొకేషన్ అన్వేషణలోనే ఉండిపోయాడు. 
         మెల్లగా ఆటో కదిలింది. ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్న అమ్మాయి ఒకతి వాళ్లకు కుడివైపుగా వెళ్తుంది. సన్నని నడుము కలిగినది. గుండ్రని ముఖాన్ని కలిగి ఉంది. 
      అప్పుడు ఆమెని చూస్తున్న ఇద్దరిలో హీరో ఆమె నడకను చూసి…
 "రవివర్మ గనక బతికి ఉంటే అతని కుంచె లోంచి ఇంకో అప్సరస ఈ లోకం కంటికి కనపడేదేమో" అన్నాడు.
ముఖానికి స్కార్ఫ్ ఉండడం వల్ల ఆమెను ఎవరు గుర్తు పట్టలేరు. ఆమె కూడా వీళ్ళను చూడలేదు. 
ఇలా కొంత సమయం తరువాత అదే దారిలోకి ఇంకో ఆటో వచ్చింది. ఈ ముగ్గురు ఒక పెద్ద మర్రిచెట్టు పక్క నుంచి తొంగి చూస్తున్నారు. 
ఆటోలో డ్రైవరు తప్ప ఎవరూ లేరు. అటు ఇటుగా చూసి ఆటో దిగి నేరుగా ఆమె వెళ్లిన దారిలోనే వెళ్ళాడు. 
    ఈ ముగ్గురు కూడా అతన్ని అనుసరిస్తూ వెళ్లారు. అలా కొంత దూరం వెళ్ళాక ఒక దగ్గర వీళ్ళకి ఒక ఆడ, మగ మనిషి కనిపించారు. కాస్త తీక్షణంగా చూస్తే ఆటోలో వచ్చినవారేనని అర్థమైంది.
    ఇంకా ముగ్గురు అట్లానే చూస్తున్నారు దొంగల్లాగా. ఆమెకు ఆటోలో వచ్చినవాడు డబ్బులు ఇచ్చాడు. అటు తర్వాత ఆమె ముఖం అక్కడ వైపు తిప్పి నడుచుకుంటూ ఇద్దరూ దగ్గరనే ఉన్న ఒక ఇంట్లోకి పోయారు. ఇదంతా చూసిన ఆ ముగ్గురికి గుండె మీద రాయి పడ్డట్టయింది.ఇప్పటి వరకు మేమంతా చూసింది ఒక వేశ్యనా? అని వారిని వారే తిట్టుకున్నారు. 
       ఇట్లా ముగ్గురు కూడా ఒక పొడవాటి కొబ్బరి చెట్టు కింద కూచున్నారు.
       "అరేయ్! మనం అనుకున్నది అంతా వృధానే అయ్యింది. తెలియక మనమంతా ఇప్పటిదాకా ఒక వేశ్యని హీరోయిన్ ని చెయ్యాలనుకున్నాం ఇక వద్దురా వెళదాం పదా"
     "ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆ అమ్మాయి చేసే పని మన దృష్టిలో, ఈ నీచ సమాజ దృష్టిలో తప్పు కావొచ్చు కానీ ఆమె దృష్టిలో మాత్రం తప్పు కాదు. అసలు ఆమె అంత అందగత్తె అయ్యి కూడా ఎందుకిలా ఈ వృత్తిలో కొనసాగుతుందో మనం ఆలోచించామా? లేదే. నిజంగా మనం గనక ఆ అమ్మాయి అలా మారడానికి గల కారణమేంటో తెలుసుకున్నపుడే మనం మనం అవుతాం. ఆమె బయటికి వచ్చాక ఇలా కావడానికి కారణం తెలుసుకొని, వీలైతే ఒక మంచి నటిగా ఆమెకో జీవితాన్నిద్దాం" అని దర్శకుడు అంటాడు.
    " అవును నువ్వన్నది కూడా నిజమే మనం ఆమెనే హీరోయిన్ గా ఎందుకు పెట్టకూడదు" అని నిర్మాత అన్న మాటకు 
హీరో- నలుగురి పక్కలో పడుకునే దానికేం తెలుసు నటన గురించి. అయినా దాని పక్కన నేను నటించడానికి ఒప్పుకోను.
" ఒప్పుకోవా… అయితే మనం అవకాశాల కోసం హైదరాబాద్ అంతటా తిరిగిన సంఘటనను ఒక సారి గుర్తు చేసుకో. ఒరేయ్ ఒక్క మాట చెప్తా విను. మనిషి అవసరానికి ఏదైనా చేస్తాడు. తాను కోరుకున్నది సాధించడానికి ఎంత కష్టమైన పడతాడు. అయినా మనకు బతకడానికి ఏ ఆధారం ఉందిరా. ఆ!.. ఆ ఆధారం లేకనే కదా సినిమాలోకి రావాలనుకున్నాం. ఆ అమ్మాయి కూడా అంతే. బతకడానికి ఏ ఆధారం లేదు కాబట్టే ఆ వృత్తిలోకి దిగింది. ఒక్కటి గుర్తుపెట్టుకోరా…. అన్ని సరిగ్గా ఉంటే ఏ స్త్రీ కూడా ఇల్లు విడిచి పరాయి పురుషుడి వంక కన్నెత్తి కూడా చూడదు. ఆమెకున్న కష్టాలే ఆమెను అమ్ముకునేలా చేసినట్టున్నాయి.
వీలైతే మనం ఆమెకు సర్దిచెప్పి మంచి జీవితం ప్రసాధిద్దాం. అంతేకాని ఇలాంటి అనవసర మాటలకు నేనసలు ఒప్పుకోను". 
     వీళ్ళు ఇట్లా మాటల్లో పడగానే అక్కడి నుంచి వస్తున్న ఆమెను హీరో చూస్తాడు. తల దించుకొని వీళ్ళవైపు ఆమె వస్తుంది.
      ఆమె వాళ్ళను చూసి బస్సులో ఉన్నవారే వీరని నిర్ణయించుకుంటుంది. అట్లా చూసి చూడగానే అల్లంత దూరం నుంచి ఆమె వెళ్తుండగా నిర్మాత 
    "ఒక్క నిమిషం" అని అనగానే
వెనకకు తిరిగి బిడియంతో తల ఎత్తి మౌనంగా ఉంటుంది. 
 " అసలు ఎవరు మీరు?
   ఇదంతా ఏంటి?
   అని అడగ్గానే 
   ఆమెకు ఏం చెప్పాలో తోచలేదు. అయినప్పటికీ చెప్పే ప్రయత్నంలో సతమతమవుతున్నది. 
  " ఏం భయపడకండి చెప్పండి. అసలు దీనికి కారణం ఏంటి? అని హీరో కూడా అడగ్గానే…
       " నా పేరు హారిక. మాది రావులపాలెం దగ్గర చిన్న ఊరు. నాకు పెళ్లయి మూడేళ్ళు అయ్యింది. నాది మతాంతర ప్రేమ పెళ్లి. మావూరే అతనిది. నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు నా వెంటపడుతూ ప్రేమిస్తున్నాను నువ్వొప్పుకుంటే షాది కూడా చేసుకుంటాను అని మాయ మాటలు చెప్పి నన్ను లొంగదీసుకొని తాళి కట్టాడు. నేనీ పని చేయడం వల్ల ఊళ్ళో పరువు పోయిందని మా అమ్మానాన్నలు ఇదే గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన నా భర్త తిరిగి నా దగ్గరకు రాకుండా, ఊరిడిచి వెళ్ళాడు. అప్పటి నుంచి నన్ను మా ఊరిలో అందరూ నీచంగా చూడడం వల్ల ఏం చేయాలో అర్థం కాలేదు. కనిపించిన ప్రతి యువకుడు కూడ ఎంత కొస్తావ్ అని అడిగేవారు. ఇట్లా ఇన్ని బాధల్ని పడ్డ నేను చనిపోదామనుకున్న కానీ ఇట్లా ఛస్తే లోకం నా మీద దుమ్మెత్తిపోస్తుంది ఇది నిజంగానే బజారు ముండ అని నింద వేస్తారని ఆగాను. కానీ నేననుకున్న దానికి పూర్తి విరుద్ధంగా జరిగింది. ఇంకో పెళ్లి చేసుకొని చక్కగా ఉందామనుకుంటే చెడిపోయిన ఆడదని ఎవ్వరూ ముందుకు రాలేరు. అలాంటి సమయంలో ఇక చస్తే చావకూడదని నిర్ణయించుకున్న. కానీ బతుకుదెరువు కోసం ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఇదిగో ఇట్లా మారాల్సి వచ్చింది." అని పాపం ఏడుస్తూ చెప్పింది. 
     ఇదంతా విన్న ఆ ముగ్గురు "సరే నువ్వేం బాధపడకు. ఇక నువ్వు చేస్తున్న ఆ పాడు పనిని మానుకో. నువ్ సినిమాలో నటిస్తా అంటే నీకు హీరోయిన్ గా అవకాశం ఇస్తాం" అనగానే
      " నాకు జీవించటం తప్ప నటించటం రాదు. ప్లీజ్ నా మానాన నన్ను బతకనియ్యండి. నేను చేస్తున్న పని ఈ సమాజం దృష్టిలో తప్పే కావొచ్చు కానీ నేను ఒంటరి అయినప్పుడు ఈ సమాజం నాకు తోడుగా నిలవలేదు. అలాంటప్పుడు ఈ సంఘం ఏమైపోతే నాకేంటి. నా మానం పోయినా నాకు బతకడానికి ఇంత కంటే సులువైన మార్గం ఇంకేమి కనపడలేదు. దయచేసి నన్ను వదిలేయండి".
      " ఆగండగండి… తొందరపాటు పడకండి. మీకు నటించడం రాకపోయినా ఫర్వాలేదు. మేం చెప్పిన సీన్ లో జీవిస్తే చాలు. విజయం సాధిస్తే గనక మీకు ఇంతకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. అప్పుడు సక్రమ మార్గంలో ఇంకా విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు" అంటారు
        "సరే గానీ ఇంతకు మీరు ఎవరు? మిమ్మల్ని నిన్న రాత్రి బస్సులో చూశాను. మీరేం చేస్తారు." అడిగింది
     " మా ముగ్గురిది ఒకే ఊరు. మాకు సినిమా అంటే పిచ్చి. అందుకనే ఊరు విడిచి హైదరాబాద్ వెళ్లినా అవకాశం దొరకకపోవడంతో మళ్ళీ ఊరుకే వచ్చాం. మాలో ఒకరు హీరో, ఒకరు దర్శకుడు, ఇక నేను నిర్మాతని. మా దగ్గర మంచి కథ ఒకటి ఉంది. అందులో మీరు మా హీరోకి హీరోయిన్ గా నటిస్తే మీ జీవితం మారిపోవచ్చు. ఒక సారి ఆలోచించండి" అంటాడు నిర్మాత
     " ఇక ఆలోచించడం ఏం లేదు. మీరు ఇంత నమ్మకంతో చెప్తున్నారు కాబట్టి మీ సినిమాలో నేనే నటిస్తా" అని ఒప్పుకుంది. 
    " కానీ ఒక్క షరతు. ఇప్పటి వరకు మీ జీవితాన్ని మీరు పూర్తిగా మర్చిపోవాలి"
        " సరే మర్చిపోతాను" అంది
మరుసటి దినం వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాలతో షూటింగ్ కోసమని గోదారి ఒడ్డుకు వెళ్లారు. అట్లా సాయంత్రం అయ్యింది. 
పాపం ఆ సినిమా కథ ఆమె కథేనని తెలియక నిజ జీవితంలోనే కాక తెరపై కూడా జీవించడానికి ఒప్పుకుంది అమాయక హీరోయిన్.
       షూటింగ్ జరుగుతోంది. పాటలో హీరో హీరోయిన్ ని ముద్దు పెట్టుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసి సిగ్గు పడుతూ సూర్యుడు కూడా భూమిని ముద్దాడడానికి పరుగెత్తాడు.



                     ఘనపురం సుదర్శన్
                     07.06.2020
                     9000470542

     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం