నా సెల్ 9000470542



     'పట్టణాల చరిత్ర పట్టు తప్పితే రాబోయే రోజుల్లో భవిష్యత్తుకు బాటలు ఉండవు'. ఇది చాలా గొప్పగా నిర్మితమైన అరుదైన మాట. బహుశా ఇలాంటి ఆలోచనకు సోపానాలు నిర్మించుకొనే ధృఢమైన పట్టణ చరిత్ర రాయడానికి పూనుకున్నట్టున్నారు ప్రముఖ సాహితీ వేత్త, ప్రసిద్ధ విమర్శకులు గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి గారు. 
      ఏదేమైనా ఒక ప్రాంత చరిష్మాను తనదైన శైలిలో నిర్మించడంలో ఈ వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఎందుకంటే గత చరిత్రే రాబోయే కాలానికి పునాది అయినట్టు, పట్టణాల వారిగా నిర్మించిన చరిత్ర అంతా కూడా వెలువడబోయే భవితవ్యానికి బంగారు బాటలు వేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ఈ గత చరిత్ర అంతా సాహిత్యంతో నిర్మితమవ్వొచ్చు లేదా ఆర్థిక, రాజకీయ అంశాలతో నిర్మిత మవ్వొచ్చు. గానీ ఈ పుస్తక రచయిత ఏ ఒక్క అంశానికి సరిహద్దులు గీసుకోకుండా సగటు మనిషికి జీవన యానంలో ఏవైతే తోడ్పతాయో వాటన్నింటినీ ఇందులో స్పృశించారు. 
    ప్రాథమికంగా అది పల్లె అయినా, పట్టణమయినా దానికున్న వైభవాన్ని పాఠకుల మనసు లోగిళ్ళలోకి పంపడానికి ఈ పుస్తక కర్త సుమారు అర్థ శతాబ్దం పాటు వెనక్కి వెళ్లి ఈ సిద్దిపేట ప్రాంత గొప్పతనాన్ని మనకు దర్శింపచేయడానికి ఆ ప్రాంత సాహిత్య, చరిత్రలను తనతో మోసుకు వచ్చారు. ఈ సిద్ధిపేట భౌగోళిక ప్రదేశం అచ్చమైన తెలంగాణ నుడికారానికి, సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం. ఒక పక్క కరీంనగర్ జిల్లాతో సరిహద్దును పంచుకున్నా, తనకంటూ ఒక యాసను, భాసను పెంచుకున్న మేధావుల అడ్డా ఈ సిద్దిపేట గడ్డ. 
        పూర్వపు మెదక్ జిల్లాలో భాగమైన ఈ ప్రాంతానికి అటు చారిత్రకంగానూ, రాజకీయంగానూ, ఇటు సాహిత్య పరంగా కూడా ఎంతో గౌరవం ఉంది. సిద్దిపేటకు మొదటి శాసన సభ్యులైన గురువారెడ్డి నుంచి నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు ఎందరో ప్రసిద్ధమైన రాజకీయ నాయకులు అక్షరాలు దిద్ది, నడక నేర్చి నడయాడిన నేల. ఇలాంటి నేలలో ఉన్నతమైన సరస్వతి జ్ఞాన మందిరం నెలకొని ఉన్నది. అదే సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల. ఇది పేరుకు మాత్రమే కళాశాల గానీ ఒక విశ్వవిద్యాలయానికి ఉండే చరిత్ర దీని సొంతం.
     సంగీత, సాహిత్యపు విలువలను మేళవించుకొని,  అవధాన విద్యలో అందలమెక్కి సాహిత్య కర్తలను, ప్రియులను సృష్టించిన జ్ఞాన మందిరమ్ము ఇది.
ఈ సిద్దిపేట ముఖ ద్వారమే ఈ ప్రదేశానికి చెక్కని శిల్పంపు కోట వంటిది. జ్ఞాపకాలను వ్యాపకంగా చేసుకొని వినిర్మించాలనుకున్న వీరి తపస్సుకు 'గత కాలం మేలు వచ్చుకాలం కంటేన్' అనినన్నయ అన్న మాట అక్షరాల సరిపోతుంది.
ఒక ఆత్మకథకు గానీ, జ్ఞాపకాలతో రాయాలనుకున్న ఒక ప్రాంత చరిత్రకు గానీ మూల సారం వారు అనుభవించిన అనుభూతులే పెద్ద సమాచారం. ఇందులో ఏ పుటలో చూసినా ఏదో తెలియని పదాల మాధుర్యమేదో పాఠకుని హృదయం మీద నాట్యం చేస్తుంది.
వాస్తవంలో ఈ ప్రాతం విజయనగర సంస్థానం కాకపోయినా పోలికలో మాత్రం దానికి సమానమైన స్థాయే దీనికీ ఉంది. కారణం విజయనగర సంస్థానం వలే ఇది కూడా లలిత కళలకు నిలయం కాబట్టి. ఉద్యోగ రీత్యా అధ్యాపక వృత్తిలో భాగంగా ఇతర ప్రాంతీయులు ఎందరు వచ్చినా, వారి స్వంత ప్రాంతం కంటే కూడా ఇక్కడి సంస్కృతిపై మమకారం పెంచుకున్న వారెందరో ఉన్నారు. ప్రధానంగా అవధానాలకు అలవాలమైన సిద్దిపేట అంటే సాహితీ ఉద్ధండులకు అమితమైన ప్రీతి ఉన్నట్లు సాహిత్యాభిమాన గణాన్ని చూస్తే తెలుస్తుంది. ఒక పక్క సాహితీ మరమరాలను ఆరగిస్తూనే మరో పక్క ఉద్యమ పునాదుల్ని గట్టిగా కట్టుకున్న ప్రాంతం కావడం వల్ల ఇది అన్ని వర్గాలకు సంకేతమైంది. 
      రాజకీయ నాయకుల రాజసం ఉట్టి పడేలా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందీరాగాంధీ మొదలుకొని నందమూరి తారక రామారావు వరకు ఎందరినో ఆదరించిన ఆదర్శవంతమైన పేట ఇది. దీని గొప్పతనాన్ని బట్టే పేరుకు తగ్గట్టుగానే ప్రసిద్దిపేటగా పెట్టడంలో వారి చతురత చమత్కారం వెల్లడవుతుంది.
       ఒక పార్శ్వంలో చూసినట్లయితే ఈ పుస్తకంలో రచయిత ప్రతి పుటలో ఉండి చదువరులకు కనపడకుండా తన వేలు పట్టుకొని పోయేటట్టుగా చిక్కని పదాలతో అమృతతుల్యం వంటి అర్థాలతో చదవాలన్న తృష్ణ కల్గిన వారి ఆకలి తీర్చడంలో జ్ఞానదాతగా దర్శనమవుతారు. ఇది వారి జ్ఞాపకాల సారమే అయినా, అనుభవాల మూటయే అయినా అందించాల్సిన సమాచారంలో మాత్రం అందెవేసిన చేయి. 
     వస్తువుల్ని గానీ, జ్ఞానాన్ని గానీ నిక్షిప్తం చేయడంలో లాభ నష్టాలు ఏవైనా ఎదురుకావొచ్చు. దాచుకుంటే దొంగల పాలవుతుంది. పంచుకుంటే పండితుల పాలవుతుంది అనే మాటలో రెండో మాటకు పరిపూర్ణమైన నిదర్శనం ఈ పుస్తక రచయిత. వల్లమాలిన మమకారం, పురిటిగడ్డపై ప్రేమ ఈ రెండు కలిసి నిన్న మొన్నటి జ్ఞాపకాలను రేపటి తరానికి అందించబోయే భవితవ్యాన్ని హస్తభూషణం మా ప్రసిద్ధిపేట అనే చిరు పొత్తం.
      తెలుగు సాహిత్యంలో ఇలాంటి నవీన పద్దతిలో మరెన్నో ప్రాంతాల ఘన సాహిత్య, చరిత్రలు పుట్టుకరావాలన్నది రచయిత యొక్క దృఢమైన కాంక్ష.


              -ఘనపురం సుదర్శన్
               పరిశోధక విద్యార్థి
       ఉస్మానియా విశ్వవిద్యాలయం

1 కామెంట్‌:

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం