కరోనా పోయే బిరానా
ఇంజనూ లేదు ఇంధనమూ లేదు
శరీరాన్నే ఇంజనుగా
రుధిరాన్నే ఇంధనంగా
బతుకు జట్కా బండి
నడుపుతున్న బాటసారులం
పొమ్మనువారు లేరు
రమ్మనువారు లేరు
తియ్యని జీవిత ఆశలే
ప్రాణమున్న పొదరిల్లు వైపు
అడుగులు వెయ్యిమన్నాయి
సంకలో చంటి పాప
ఏడుస్తుంటే కరుణించమని
సూర్యుడిని వేడుకున్నాం
ఒళ్ళు తడుపుకోడానికి
నీళ్లు లేక చెమటను
కార్చుకొని స్నానం చేసాం
కాళ్ళలో నడిచే సత్తువ లేక
కారిన రక్తాన్ని చూసి
కళ్ళు తిరిగి పడ్డాం
దారినపోయే ఒక్క బండన్న
ఆపుతుందేమోనని ఆశతో
దానాన్ని ఆశించాం
వేల కిలోమీటర్ల గమ్యం కోసం
వేళకు బయలుదేరలేకపోయాం
నెత్తిన మూటల్ని
ఎత్తుకొని మాటల్ని కాలక్షేపానికి
అరువిచ్చాం
అన్నం దొరక్క బిడ్డ పెట్టిన
కేకలకు కాకులు
కూడా కన్నీరు కార్చాయి
సాయం చేసే చేతుల కోసం
నిద్రను మాని కళ్ళు
కాపలా కాశాయి
కనుకరించే కరుణ హృదయుల
ఎదురుచూపులకు
కళ్ళల్లో వత్తులేసుకున్నాం
కాటేసే కరోనా
భయానికి బంధాలను
అందలమెక్కించాం
క్వారంటైన్ ఈ పాపిష్టి
వైరస్ కు ఎప్పుడు
ద్వారం తెరుస్తుందో
కోవిడ్ లేని దేవిడీలు
ఎన్నడు దర్శనమిస్తాయో
ప్రాణాలన్ని రెక్కలు
విరిగిన పావురాల్లా
భూమినే ముద్దాడుతున్నాయి
అశువుల కొరకు
పశువుల్లా బిక్కమొహలేసి
చూస్తున్నాం
అందరిని దేవుళ్లల
కొలుస్తూ
ఊపిరి బిక్షను
అడుక్కుంటున్నాం
ఘనపురం సుదర్శన్
పరిశోధకుడు
ఉస్మానియా విశ్వవిద్యాలయం
9000470542
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి