ఎంగిలి మల్లెపువ్వు
లచ్చుమయ్య బిడ్డకు ఇది పదకొండో సంబంధం. వచ్చిన ప్రతి సంబంధం కట్నం దగ్గరనే ఆగిపొయ్యింది
మున్పటి త్యాప ఒచ్చినొల్లు మూడు లక్షలు, రెండో త్యాప ఒచ్చినొల్లు ఐదు లక్షలు ఆడిగిర్రు. ఇట్ల సంబంధాలు పెరిగినట్టే కట్నం గూడ ఎక్కువగా ప్రతి సంబంధానికి పెరుగుకుంట పొయింది. కట్నం ఎక్వ అడిగినందుకే లగ్గం ఖాయం గాలేదు. ఇగో గిప్పుడు పదకొండోది గూడ ఖాయం కాలేదు.
లచ్చుమయ్య బీదొళ్లకే బీదోడు.
వందకు ముప్పై ఏల్లే తక్వ ఈనేకు. ఇంట్లైతే బువ్వ కొరకు ఒక్కో పూటకు మధ్య పెద్ద యుద్ధమే జరిగేది. వ్యవసాయం జేసుకుందామంటే పొలం ఉండదు. మేపుకుందామంటే పశువులు ఉండవు. కాయకష్టం జేసుకొని బతుకుదామంటే ఒంట్లో సత్తువ ఉండదు. పేరుకు మాత్రం రెడ్డి. పటేలోళ్ల ఇంట్ల పుట్టిండన్న పేరే గానీ, మెతుకులు దొరకని బీదోడు. కనీసం ఆ సర్కారు ఇచ్చే పింఛను మీద బతుకుదామన్న ఆశ ఉన్నా గానీ పెద్ద కులపోడని సర్కారు పింఛను గూడ ఇయ్యలేదు.
ఒగ పక్క ముసలి పండు. అసలీ పండు ఎన్నడు పలిగిపోతదో ఆ పండుకే దెల్వదు. ఇంగో పక్కనేమో నిండు యవ్వనం గల పదహారేళ్ళ పడుచు. జీవితాన్ని అనుభవించి చచ్చిపోదామన్న విరక్తి ఒక పక్క. జీవితం ఇప్పుడే మొదలైందంటూ అనుభవం పొందడానికి తహ తహ లాడుతున్న ఆశ ఇంగో పక్క.
వాడిపోయిన పువ్వు ఎప్పుడు రాలుతుందో తెలియక తండ్రి మస్తు బాధ పడ్తుంటడు. "ఇప్పుడే పూసిన మొగ్గ నేను, నేనెవరి చేతిల పడ్తానో నాకే తెల్వదని" బిడ్డకు బాధాశ. ఇన్ని కష్టాలున్న ఈ చిన్న కుటుంబానికి పెద్ద దిక్కైన మానెమ్మ పడమర నుంచి జీవితపు మెట్లు దిగి ఎన్నడో గోడ మీదికెక్కింది.
లచ్చుమయ్యకు ఇరవై మూళ్ళ వయసున్నపుడు మానెమ్మ మెడల దండ పడ్డది.
***
లేక లేక పెళ్ళైన పదిహేనేళ్లకు కడుపుల రాయివడ్డదని శాన సంబరపడ్డరు. ఎన్నెన్ని గోపురాలకు పోయిర్రో.
ఎన్నెన్ని రాళ్లకు ముడుపులు కట్టిర్రో. సమ్మక్క సారక్క గద్దెకు గూడ ఎన్ని సార్లు నైవేద్యంగా బంగారాన్ని పెట్టిర్రో. అట్ల నోచిన నోములకు మొక్కిన మొక్కులకు పుట్టిన ఆడపిల్లే నాంచారి.
ఈ పిల్ల మానెమ్మ గర్భాకాశం నుంచి తోక చుక్కలెక్క రాలిపడ్డప్పటి సంది వాళ్లకు ఇగలేని కష్టాలు. మానెమ్మ బాలెంత అయిన నెల నాటికే అరి శేన్ల నాటనికే పొయ్యేది. ఎండల పెయ్యి ఒంచి పని జేస్తుంటే ఆ ఎండ కొడకు ఆమె రొమ్ములున్న పాలన్ని ఇంకిపోయ్యేవి.
అమ్మెటిల్లప్పుడు, పొద్దు వొయినంక సంటి పిల్లకు పాలిద్దమంటే సుక్క గూడ ఒచ్చేటివి గావు.
పాపం ఆ బుడ్డ పిల్లకు ఆకలై ఎన్ని సార్లు నోరెండిపోయిందో. ఇగ బర్లన్ని ఊళ్ళకు వచ్చేటాళ్ళకు ఆ పిల్ల ఏడుపు గోస ఇని మానెమ్మకు పాల సుక్కల బదులు కన్నీళ్ల సుక్కల రాలి పడ్డయి. ఆ సుక్కలు పిల్ల పెయ్యి మీద పడంగనే లేషి ఒకటే ఏడిశేది.
ఇగ గిదంత గాదనుకొని ఎన్నడో కూలికి పోంగా వచ్చిన రాగులు కొన్ని కుండల ఉన్నందువల్ల అవ్విట్లను ఉడకవెట్టి అంబలి కాశి సంటి పిల్ల ఆకలి దీర్శింది ఆరోజు.
అగో గట్ల మానెమ్మ పొద్దనక మాపనక తిప్పలవడి పిల్లను పెంచి పెద్దగ జేసింది.
పదకొండు ఏండ్లు ఒచ్చినయ్. ఈ పిల్లకు లంగవోణి అంటే మస్తు పానం. సూడనీకే రాణిలెక్కే ఉంటది. ఈ పిల్ల సొగసు వరూధిని లెక్కనే ఉంటది.
"లంగవోణి ఏస్కుంటే నా బిడ్య మొగులు మీద సుక్కలెక్క ఉంటది" అని మానెమ్మ మస్తు ఖుషి వడేది.
మొగులు శెట్టుకు పూసినోడు పడమరకు పొయ్యేటాళ్ళకు రాలి కింద వడ్డడు. నాతిరి ఎల్తురును భయవెట్టింది.
మళ్ళ తెల్లారి తొమ్మిది గొట్టంగ నాంచారి మట్టిల చిర్రెగోనే ఆడుకుంటున్నది. ఇట్ల ఆడ్తుంటే ఈ పిల్లకు పెయ్యిలా ఎట్లనో అనిపిచ్చింది.
సక్కగా వోయి మానెమ్మకు జెప్పింది. మానెమ్మ జూడఁగనే తెలివొచ్చింది.
ఇంకేముంది. పిల్ల పెద్దమనిశయింది. మానెమ్మ నెత్తి మీద గుండు వడ్డట్టయింది.
పాలోళ్ళకు ఆళ్లకు ఈళ్లకు అందరికి జెప్పి మూలకు కూసోవెట్టింది. గుడాలు, బెబెర్లు ఉడకవెట్టి కల్లు సీసా ఇచ్చి యాటను కొయ్యకుండనే దావతును వోడగొట్టింది.
నెల గడిషిపోయింది. నాంచారి సముర్త అయినప్పటి సంది ఏవేవో కలలు ఒస్తుండేవి. ఎవరన్న మొగ పిల్లగాళ్ళు కన్పిస్తే ఎట్లనో జూసేది. మన్సుల మన్సు ఉండేది గాదు. మాటి మాటికి మిద్దె మెట్లు, గుట్టలు, కొండలు
ఎక్కాలనిపిచ్చేది. ఊకే క్యారెట్లను, బెండకాయలను, కొరకాలనిపిచ్చేది.
ఇట్ల ఒకనాడు పొద్దస్తమానం పచ్చి వంకాయలను కోరుకుతుంటే మానెమ్మ జూసింది. ఇగ అప్పటి సంది పిల్లకు లగ్గం జెయ్యాలని అనుకుంది. కానీ ఆ దేవుడు ఆమెకు ఆ భాగ్యమియ్యలేడు. ఒకనాడు సూరీడు నెత్తి మీదికొచ్చిన యాళ్ల కూలికి వొయిన కాడ తుమ్మచెట్టు మీద పడి నెత్తి పల్గింది. మానెమ్మ పానమెంటనే పొయ్యింది.
***
లచ్చుమయ్య పానం మంచు లెక్కే ఇంతకింత కరిగిపోతుంటది. మానెమ్మ సచ్చిన రెండేళ్లకు తొల్త సంబంధం జూసిండు. గట్ల సంబంధాలు సూసి సూషి యాష్టకొచ్చేది. కట్నమియ్యలేక పెండ్లి జెయ్యలేక కండ్లల్ల నీళ్లు గార్చేటోడు.
అట్ల ఒక దినం పొద్దుగాల పక్కూరైన రామన్నగూడెం నుంచి ఒకింటొళ్లు లచుమయ్య ఊరైన నాంచేరికి శేరుకున్నరు.
ఊళ్ల మీదికేర్కి లచ్చుమయ్య గుడిశె ఉంటది.
నడుసుకుంట నాంచేరికి పోవడంతో పిలగానోళ్ల సుట్టాల పెయ్యిలన్ని షెమటకు తడ్షిపోయినయ్. యాష్ట వడి మొత్తంమీద గుడిశెలకు పొయ్యిర్రు.
నాంచారి ఇప్పడి దాంకా అసొంటి పిల్లగాన్ని యాడ జూడనేలేదు. ఆ పిలగాడు పీటే మీద కూసోంగనే ఆమె మన్సు మీద కుసున్నట్టే అయ్యింది. నాయ్నకు జెప్పలేదు గని పిలగాన్ని సూషినప్పుడే శిగ్గు వడ్డది.
కంకంరాల పువ్వులసొంటి రంగు జాకెట్టు. కొంచెం ఆకువచ్చటి లంగ వోణిల రాజ కుమారిలా కనవడ్డది ఆ పిలగానికి.
బిగ్గరి జాకెట్టు ఏస్కున్నందుకు ఆ పిల్లకు రొమ్ములు మస్తు ఒత్కపోవొచ్చు ఎవ్వర్కి జెప్పలేదు గని.
పిల్లగాన్ని జూసిన మోజులో ఆ ఒత్కపోయిన నొప్పిని మన్సున వెట్టలేదు నాంచారి.
" నీ పేరేంది. ఏం జేస్తవ్ నువ్" లచ్చుమయ్య అడిగిండు.
"ఎంకటసామిరెడ్డి. నన్నందరు మా గామంల ఎంకటిగా అంటరు. ఇగ నేనైతే ఎవుసం జేస్తా. నాతిరి నిద్ర వోనికే గింత కల్లువొట్టు తాగుత." అంటడు
"అట్లనే గని. మా తానైతే జాయ్ జాతెం లేదు. మా పిల్ల మాత్రం సుక్కలెక్క సక్కగున్నది. గా పిల్లనే మా జాయ్ జాతి. కట్నంమైతే ఇయ్యలేం. ఇగ మీ ఇష్టం మరి"
"ఐనమానే మాకు కట్నం మీద ఆశ గూడ లేదు. మా ఇంట్ల నేనొక్కన్నే ఉంట. మీరు పెండ్లి జేశిస్తే గదే నాకు పదివేలు".
***
నాంచారి ఎంకటసామిలు ఒక్కటైరు. పెండ్లిళ్ల పప్పన్నం సీటు వెట్టిర్రు. బియ్యం పోసుకునుడు అయినయ్. ఇగ అప్పగింతలకు దగ్గర వడ్డది.
నాంచారికి తండ్రినిడిషి పోబుద్ది గాలే. పోక తప్పదు గాబట్టి తండ్రికి కన్నీళ్లను గుర్తుగా ఇచ్చి పోయింది. నాంచారి తండ్రినిడిశి పోతుంటే లచ్చుమయ్యకు గుండె పగిలి నట్టయింది.
అట్ల మూడు పున్నమిలు గడిషినయ్. ఆళ్ల మనసులు గూడ గట్లనే కలిషినయ్. ఒకర్ని ఇడిషి ఒకరు ఉండనంతగా తీగల లెక్క అల్లుకుపోయిర్రు.
పెండ్లయి మూణ్ణెళ్లయింది. ఇంట్ల తిండికి గింజ పుట్టలేదు. ఎంకటసామి పేరుకే రెడ్డి గానీ ఎడ్డొని కన్నా కనిగష్టం.
ఏం పని జేయడు. ఉట్టిగనే తాగి తిర్గెటోడని
పత్తలాటకు గూడ మరిగిండని తెల్సుకున్నది.
ఇగ ఇట్ల గాదు అని నాంచారి కూలికి పోవడం సురువుజేసింది.
అట్ల ఒకనాడు నాతిరి అజా ఇచ్చే యాళ్ల అయ్యింది. నాంచారి అప్పటికే కూలి వొయ్యి అల్సిపోయి బుక్కెడు బువ్వనో, గంజో పొట్టలేస్కోని నిద్రవట్టింది.
ఇగ ఈ పీకజాలని మొనగాడు, శ్రావణయ్య పంతులు తాన యాభై రూపాలు అప్పు జేసి పొట్టవలిగేటట్టు తాగొచ్చిండు.
గట్టిగా తల్పు గొట్టి….
" ఏమైందే బద్దుమాశి అప్పుడే వండుకున్నవ్" అని గట్టిగా తిట్టిండు.
ఆ సప్పుడుకు నాంచారి గద్దున ఒనికింది.
"ఒక్కదానివే వండుకున్నవా?
నీ యాలి నువ్ కూలికి వోతావే? సూషినోల్లంత ఏమనుకుంటరు. ఈ ఎంకటిగాడు ఏం పని జెయ్యడు. మీదికెళ్ళి తాగుతడు. మళ్ళా ఇంకా పెండ్లాన్ని కష్టవెడుతుండు అని అందరు అనుకొనికేనాయే"
ఈ మాటల్ని ఇన్న నాంచారికి దుఃఖమాగలేదు. "ఎప్పుడు ఎవరి చేతిల తిట్లు తినని నేను ఇయ్యల ఇన్ని తిట్లు తింటున్న" అని బాధపడుకుంట ఏడుస్తది.
ఇట్ల కొన్ని దినాల దాంకా ఇదే తంతు. ఉన్నట్టుండి ఏమైందో ఏమో గానీ ఎంకటసామి పత్తాలు మానిండు. మందు తాగడం మానిండు. ఎప్పుడొచ్చినట్టే నాతిరి అజా అప్పుడు ఇంటికొచ్చిండు.
వంట జేస్తున్న నాంచారి దగ్గరికి పోయి
"నేను తప్పు జేషిననే. నిన్ను అనరాని మాటలన్న, నిన్ను అర్థం జేసుకోకుండా మస్తు కొట్టిన, తప్పయిందే. ఇప్పటి సంది తాగను, నిన్ను కొట్టను, బుద్దిగ పని జేస్కుంటా" అని
తన తప్పును తెల్సుకుండు.
కానీ నాంచారికి ఒక షర్తు వెట్టిండు
" ఊళ్ళ ఉంటే మనం మంచిగ బత్కలేమే
చెయ్యనికే పని గూడ దొర్కుతలేదు. అందుకని మనం ఐరవాదుకు పోదాం. పొయ్యి ఆడ మంచిగ యాదో ఒక పని జేస్కుంటా కాలమెల్లదీతం" అని మంచి జెప్పిండు
నాంచారికి ఇవన్నిటిని నమ్మ బుద్ధి కాలేదు గాని నిజంగనే మారిండేమో అనుకొని "సరే బావ నీ ఇష్టం. అట్లనే పోదాం గని నువ్ మళ్ళ గూడ తాగితే నా మీద ఒట్టే"అన్నది.
***
పట్నంకు ఒచ్చి రెండు అంగళ్ళయింది. చెయ్యనీకే పనికోసం మస్తు దేవులాడిర్రు. అట్ల లెంకంగ లెంకంగ నక్కిలేసు రోడ్డు తొవ్వలో ఒక పెద్ద ఓటల్లో నాంచారికి పని దొర్కింది. అట్ల ఆమె ఆడ కుదిరింది.
ఎంకటసామి రెడ్డి గూడ లక్డీకపూల్ లో ఒక మందు దుకాణంలో పనికి కుదిరిండు.
అట్ల సంసారం కొన్నొద్దులు ముందల పడ్డది. ఒకరు జేసే పని గురించి ఒకరు జెప్పుకున్నరు.
ఆరోజు శనివారం. టెంకుబండును జూడనీకే గుంటూరు నుంచి ముగ్గురు ఆడపిల్లలు ఒచ్చిర్రు. ఆళ్లు నిండు వయసులో ఆకలితో ఉన్నరు. కంపు వాసనొచ్చే ఆ నీళ్ళ మీద పడవల తిరిగిర్రు.
"తిరిగిన కాడికి సాలు, పొద్దు వోయింది ఇగ పొండి" అని ఆళ్లకు బుద్ధుడు గీన జెప్పిండో ఏమో మరి. సీదా నాంచారి పని జేస్తున్న ఓటళ్లకు పొయ్యే సరికి నాతిరి ఎనిమిదయింది. నాంచారి ఆమె ఉండే మేదిపట్నంకు ఆటవుల పోయింది.
మళ్ళ తెల్లారి ఎప్పుడు వోయినట్టే నాంచారి పనికి పోయింది. ఓటల్లో రూము ఊడుద్దామని ఒక రూము తల్పు తెరిశి రెండడుగులు లోపలికి వేసి వెంటనే గబగబా బైటికి ఒచ్చినది.
తొందరగా మెట్లు దిగి ఓటల్ యజమానికి ఆడ జరిగిన విషయం జెప్పింది.
ఆయన ఏమి విననట్టు పట్టించుకోలేడు.
మళ్ళ మళ్ళ జెప్పడంతో ఇసిగిపోయి
"నీకు తెల్వదేమో ఈడ అసొంటియే జర్గుతయ్. సూషి సూడనట్టుగా ఊకోవాలే" అని అనడంతో
"ఛీ! ఇదేం పాడు పని. ఆళ్లకు ఇంత గూడ సిగ్గు షెరం లేదా?" అని మన్సులో అనుకుంది.
"నేను గిన్ని దినాలు గిసొంటి దాన్ల పని జేశ్నాను" అని ఆమెనామేనే తిట్టుకున్నది.
ఆ ముగ్గురు అమ్మాయిలను మొగ పిల్లలతో బత్తెల జూసినప్పటి సంది నాంచారమ్మకు ఎట్లనో అనిపిచ్చింది.
ఒక్కోసారైతే పని మానేయ్యాలనిపించేది. మళ్ళ పోకపోతే పొట్ట గడవదనిపించేది.
ఏమైతేనేం అనుకొని తెల్లారి పనికి పొయ్యింది. అక్కడ ఆమె కంటే ముందు పనికి కుదిరిన ఒక ఆమెకు ఆ ముచ్చట జెప్పింది.
ఆమె ఆ ముచ్చట వినగానే" పిచ్చిదానా ఈడ జరిగేదే గిది. యభిచారం జేస్తే మన బతుకులు బాగుపడుతయ్. మన గుడిశెలు మేడలైతయి. మనం కార్లుల్లా తిరగొచ్చు. ఇప్పుడు నన్ను జూడు. ఎంత మంచిగున్ననో.
నేను గూడ నీ లాకనే ఈడ పని జెయ్యనీకే ఒచ్చినప్పుడు నా పెయ్యి మీద శీర దప్ప ఇంకేం లేకుండే. ఇప్పుడు జూడు పెయ్యి నిండ బంగారం, మూడు పెద్ద పెద్ద కార్లు. ఇద్దరు డైవర్లు" అని ఏదో గొప్ప పని జేసి పైసలెంటకేశినట్టు జెప్పుకుంట పోతనే ఉంది.
ఇదంతా ఇన్నంక నాంచారి ఆలోచనలో ఏదో మతలబు జరిగింది.
"నేను గూడ అట్ల జేస్తే మస్తు పైసలు ఎంటకెయ్యొచ్చు "అని ఒకసారి
"ఇట్ల తప్పుడు పని ఎందుకు జెయ్యాలే" అని ఇంకోసారి ఆలోచించి
"ఏదైతేనేం కష్టపడకుండనే పైసలొస్తయంట ఇంకేమి గావాలే" అని ఆమెకామెనే యభిచారం జెయ్యనీకే అనుమతిచ్చుకుంది.
గంట అయినంక మళ్ళా ఆమె కల్సింది.
అప్పుడామే" ఏంటే నాంచారి… నీగ్గూడ కార్లు ,డైవర్లు గావాల్న ఏంది."
"మరి ఎంత కష్టవడ్డ ఇంకా ఎంగిలాకుల బతుకే నాయే. నచ్చితే కార్లే కాదు, బంగాళాలు గూడ కొంటాం"
"హ్మ్మ్ హ్మ్మ్ …
ఇగో మనలో మాట ఎందంటే. యభిచారం
జేస్తే అదేదో రోగమొచ్చి కాటికి పోతారంటనమ్మా. మరి జర జూస్కుంట.
"సరే సరే గానీ మరి నాకు దాంట్లో ఎసొంటి అనుభవం లేకపాయే. ఎట్ల బోవాలే. ఎన్ని పైసలు"
"దాని గురించి నువ్వే సొంచాయించకు.
తొలుత నువ్వు ఈ చీర కట్టుకొని, మల్లెపూలు వెట్టుకో. అత్తరు మంచిగా రుద్దుకో అక్కడక్కడ" అన్నది
ఆమె జెప్పినట్టే నాంచారి మల్లెపూలు వెట్టుకుంది, రంగు రంగుల జరీ చీర కట్టుకుంది. అత్తరు గూడ ఆకర్షించేటట్టు రుద్దుకుంది. శోభనం రాత్రి మొగని కొరకు ఎదురుజూసినట్టు తలుపుల దిక్కే జూస్తుంది.
అవన్నీ అలంకరించుకుంది. ఆమె మన్సుల ఏదో ఆలోచన" నువ్ జేస్తున్నది తప్పు అని జెప్తుంది" అయిన నాంచారి కోరిక ముందు ఈ యభిచారం తప్పేమీ కాదనిపిచ్చింది.
అంతలోనే తలుపు చప్పుడైంది. తెల్లని బట్టలు, నున్నటి బట్టతల, ఎప్పుడు జూడని బంగారం, చేతిలో పైసల కట్టలు ఇవన్నీ జూసినంక నేను జేస్తున్న పని తప్పేం గాదని నాంచారి అనుకుంది.
విటుడు ఒక రాజకీయ నాయకుడని తెల్వనంత ఎడ్డిపోరి నాంచారి. ఇంకేముంది అన్ని బందు.
అప్పుడప్పుడు నాంచారికి ఎంకటసామి గుర్తుకొచ్చిన" ఆ వాడి తాన ఏముంది. అదే కంది పప్పు, అదే పెంకుటిల్లు" అని అనుకొని
తప్పుడు పని జేస్తున్న అని అస్సలు అనిపించకుండా మరిగింది.
కాలం ఒక గంట ముందుకువోయి నాంచారున్న తలుపును తట్టింది. చేతిల పైసల కట్టతో నగుతుంది నాంచారి.
వెయ్యి బల్బుల ఎలుగును ముఖంల దాశిపెట్టుకొని ఇంటికి వొయ్యింది.
ఎంకటసామి అప్పటికే ఇంటికొచ్చి పండుకుండు. నాతిరి 10 అయ్యింది. నాంచారి సప్పుడు జేయకుండా నలిగిన మల్లెపూలను నెత్తి కాడ వెట్టుకొని నిద్దరవొయ్యింది.
శీకటంటే ఆనికెంత బుగులో, సరానా ఉర్కుతొచ్చి అందర్నీ నిద్రలేప్తుండు. ఎంకటసామి కండ్లు నల్సుకుంట లేషి నలిగిన మల్లె పూలను జూసిండు.
ఎన్నెన్నో అనుమానాలు ఊటబావిల నుంచి నీళ్లొచ్చినట్టు ఒస్తున్నయి. ఆయిన గాని ఏమనకుండా లేషి పని జేస్కుంటఉన్నడు.
"నాంచారి నాతిరి ఏడికివోయినవే శాన ఆల్షమైంది. ఈ పూలు యాడికెళ్లి ఒచ్చినయి"
" ఆ ఏం లేదు బావ ఓటల్ల జర పని ఎక్కువుండే గందుకే నాతిరిళ్లకు ఒచ్చిన. ఇగ ఈ పువ్వులను ఓటల్ల ఒకక్క ఇచ్చింది. గిప్పటినుంచి ఇగ ఇంటికి రానీకే ఆల్షమే ఐతదంట మొన్ననే పెద్ద సారు జెప్పిర్రు" అన్నది
ఆ ఆల్షం ఆంతర్యం తెల్వక నిజమేనేమో అని నమ్మిండు.
ఇట్ల నాంచారి రోజు రోజుకు ఆమెను అమ్ముకొని పైసల మనిశయింది.
ఎంకటసామి గూడ మళ్ళ మందుకు అల్వాటు వడి ఆగమాగమైండు. అంతట్లనే నాంచారి బుద్దిల ఏదో మార్పొచ్చినదని పసిగట్టి ఉల్టపల్ట అయ్యిండు.
కష్టవడ్డ పైసలతోటి యభిచారి తానికి పోనికే అళ్వాటైండు గూడ. కాయకష్టం జేయగ ఒచ్చిన పైసలన్నింటిని బజార్ల పండుకునే టోళ్లకే పెట్ట మరిగిండు.
భర్తకు తెల్వకుండా నాంచారి యభిచారం చేసి పైస సంపాదిస్తే
యభిచారంకు అల్వాటు పడి ఎంకటసామి ఉన్న పైస మొత్తాన్ని ఖర్చు చేస్తడు
ఇట్ల ఈళ్ళిద్దరి తంతు మూలలు కల్సుకోని ఇల్లు లెక్క అయ్యింది.
అయిన ఒకరు జేస్తున్న పని ఇంకొగరికి
ఎర్కగాకుండా ఉన్నరు.
ఎప్పుడు వోయినట్టే నాంచారి ఓటల్ కు వోయింది. ఒక బ్యారం ఒచ్చిందని ఆమె జెప్పింది.
నాంచారి సక్కనైన సుక్కబొట్టు ,మల్లె పూలు, అత్తరులతో అత్తింటికి వోతున్న కొత్త కోడల్లెక్క తయారై రూములో కూసున్నది.
"గప్పుడే నాంచారి తానికి ఎవర్ని బంపాలే" అని ఆమె ఎదురుజూస్తుంది.
ఆమెకెదురుంగ ఒకడొచ్చి నిలవడ్డడు. మూడు వేలకు కుదుర్చుకొని నాంచారి ఉన్న తావుకు వోయి తల్పు దెరిచిండు.
మంచంమీద ఆవల దిక్కు మొఖం దిప్పి కూసున్నది. ఎవరికి తెల్వకుండనేమో మొఖానికి బట్ట కట్టింది.
ఇవతల దిక్కు ఎంకటసామి నిలవడి ఉన్నడు. ఉషారైన మొకాన్ని ఒక్కసారిగా దిప్పింది. అప్పటికే మొఖం నుంచి బట్ట దీసింది. అంతే ఒకరినొకరు జూస్కుకున్నరు
"బరితెగించిన ఆడది భర్త నెత్తి మీద కూసుంది" అని మన్సులనుకొని ఇంటికి వోయిండు.
నాంచారి గూడ ఇంటికి వోయే సరికి చెట్టుకు యాలడవడే పిట్ట గూడు లెక్క, పంకానికి యాలడవడ్డడు ఎంకటసామి.
అంతే… నాంచారి పొయ్యే తొవ్వలిపుడు ఏ ముళ్ళు లేదు, ఏ గోడ గూడ అడ్డం లేదు.
-ఘనపురం సుదర్శన్
14.04.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి